
జనం న్యూస్ — సెప్టెంబర్ 19 తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి: శ్రీనివాస్ రెడ్డి గుండ్లపోచంపల్లి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచించారు. గుండ్లపోచంపల్లి పరిధిలోని అపర్ణ తులిప్, మ్యారిగోల్డ్, ఎల్లోబెల్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీపీ, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భక్తులు, నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.అదేవిధంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని, ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీపీ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112కు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ అధికారి విజయవర్ధన్తో పాటు పోలీసు సిబ్బంది, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.