
జనం న్యూస్ అక్టోబరు ఐదు ముమ్మిడివరంఅక్టోబరు ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాట్రేనికోన మండల తాహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె సోమవారానికి 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వీఆర్ఏలు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గత మూడు వారాలుగా విధులను బహిష్కరించి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం దారుణమని, తమ న్యాయమైన డిమాండ్లయిన పే-స్కేల్ జీవోల అమలు, అర్హులైన వారికి ప్రమోషన్లు, మరియు నామినీలుగా ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పించే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా రెవెన్యూ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు సమనస వెంకట సుబ్బారావు, వడ్డీ వీర వెంకట సత్యనారాయణ, పలివెల దుర్గ కోటేష్ వర్మ, కాశి సత్యనారాయణ, పోలిశెట్టి అచ్చిబాబు మరియు మండల పరిధిలోని వీఆర్ఏలు, నామినీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.