
కార్మికుల బకాయిలు చెల్లించాలి చెరుకు రైతులకు టన్నుకు రూ.5,500 ధర కల్పించాలి – గ్రామ సర్పంచ్ మాధవి మల్లికార్జున్ డిమాండ్
జనం న్యూస్ 09/11/2026జహీరాబాద్ నియోజకవర్గం కొత్తూరు బి గ్రామంలో మూతపడిన షుగర్ కంపెనీని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని గ్రామ సర్పంచ్ మాధవి మల్లికార్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షుగర్ కంపెనీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను కంపెనీ యాజమాన్యం వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా చెరుకు సాగు చేస్తున్న రైతులు కంపెనీ మూతపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరుకు సాగు చేయడానికి ప్రతి రైతుకు టన్నుకు సుమారు రూ.4,000 వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చెరుకు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టన్నుకు రూ.5,500 ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. షుగర్ కంపెనీ తిరిగి ప్రారంభమైతే ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులకు, కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు స్థానిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి షుగర్ కంపెనీ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని, కంపెనీ యాజమాన్యం కార్మికుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని గ్రామ సర్పంచ్ మాధవి మల్లికార్జున్ డిమాండ్ చేశారు.