
జనం న్యూస్ 19 నవంబర్ :- వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్కాయిపేట్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS మల్కాయిపేట్)లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఉదయం ప్రార్థనా సమావేశం నిర్వహణతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థి ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసంతో తరగతి గదుల్లోకి వెళ్లి తోటి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించారు. పాఠశాల సమయపాలన, తరగతుల క్రమశిక్షణ, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ వంటి అంశాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంబాబు, ఉపాధ్యాయులు వై. ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లోని దాగి ఉన్న నాయకత్వ పటిమను వెలికితీస్తాయని తెలిపారు. ఉపాధ్యాయుల బాధ్యతలను, బోధనా విలువలను విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, బాధ్యత పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల పనితీరును వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.