
జనం న్యూస్ సెప్టెంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతూ సమాజ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారికి గౌరవం కల్పించే ఉద్దేశంతో మిత్రా బృందం, కూకట్పల్లి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 పాఠశాలలకు చెందిన 200 మంది ఉపాధ్యాయులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.కార్యక్రమానికి ఏవోపీఏ రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ నిర్మాణంలో వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.జేఎన్టీయూ ఆచార్యులు కుమారస్వామి గుప్తా, భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావంతి విశిష్ట అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ స్ఫూర్తిదాయక సందేశాలను అందించారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అధ్యక్షులకు ‘గురు శ్రేష్ఠ పురస్కారం’, ఉపాధ్యాయులకు ‘గురు రత్న పురస్కారం’ అందజేసి ఘనంగా సన్మానించారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.‘రేపటి మెరుగైన సమాజం కోసం కలిసి ముందుకు’ అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమం విజయవంతం కావడంలో మిత్రా బృందంతో పాటు పాఠశాలల అధ్యక్షులు రవీందర్ రావు, అశోక్, నరేందర్, మల్లేష్, శ్రీశైలం, ఇంద్రసేనారెడ్డి, వెంకట్ స్వామి, నాగరాజు, రమణ, విష్ణువర్ధన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. వారి సమన్వయం, సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు మిత్రా బృందం నిర్వాహకులను అభినందించారు.