
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన
జనం న్యూస్ 28 అక్టోబర్ వికారాబాద్ జిల్లా :-పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడంతో పాటు, ఈ-వ్యర్థాల సురక్షిత నిర్వహణపై అవగాహన పెంపొందించేందుకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) సేకరణ కార్యక్రమం, అవగాహన క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, కీబోర్డులు, బ్యాటరీలు, వైర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి పాఠశాలకు తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ఈ-వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాటిని ప్రత్యేకంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని సూచించారు. విద్యార్థులు ఈ అంశంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, తమ కుటుంబ సభ్యులకు కూడా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం జీవశాస్త్ర ఉపాధ్యాయులు షేక్ సాదిక్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు శరత్ బాబు పర్యావరణ పరిరక్షణ, ఈ-వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, మానవాళికి వాటి ఉపయోగాలు తదితర అంశాలపై క్విజ్ పోటీ నిర్వహించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, లక్నాపూర్ శ్రీనివాస్, మధుసూదన్ రావు, కవిత, కరుణాకర్, ఛాత్రోపాధ్యాయులు, నరసింహ, ఉదయ్, రాజేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.