
జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భార్య దూరం తల్లి మృతి నాలుగు గోడల మధ్య విషాదాంతం నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన మృతదేహం గద్వాల :ఒంటరితనం ఓ నిండు జీవితాన్ని చిదిమేసింది. ఆపదలో అండగా నిలిచే వారు లేక అనారోగ్యంతో ఇంట్లోనే మృతి చెందిన వ్యక్తి మృతదేహం నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. గద్వాల పట్టణానికి చెందిన తెలుగు నరేందర్ (38) విషాదాంతమిది. నరేందర్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం సాగించేవాడు.అయితే అనివార్య కారణాలతో భార్య దూరమై విడాకులు తీసుకోవాల్సి రావడం అతని మనసును తీవ్రంగా కలచివేసింది. తనకు అండగా ఉన్న తల్లి కూడా ఇటీవల మృతి చెందడంతో మరింత ఒంటరిగా మారాడు. నాకంటూ ఎవరూ లేరు అనే భావనతో తీవ్ర నిరాశకు లోనై మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో ఇంట్లోనే మృతి చెందినా విషయం వెంటనే ఎవరికీ తెలియలేదు చివరి క్షణాల్లో కనీసం మంచినీళ్లు అందించే వారు కూడా లేకపోయారు నాలుగు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకప్పుడు అందరిలాగే జీవించిన ఓ మనిషి చివరికి ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా నిష్క్రమించడం స్థానికులను కలచివేసింది. ఆర్థిక సాయం కంటే కొన్ని సందర్భాల్లో నేనున్నాను అనే భరోసానే మనిషికి గొప్ప అండ. చుట్టూ ఉన్న ఒంటరి మనుషులను పలకరించి, వారి బాధను వినాల్సిన బాధ్యత సమాజంపై ఉందనే విషయాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.