

ఏర్గట్ల మండలంలో 1,419 నూతన కార్డుల పంపిణీ
జనం న్యూస్, సెప్టెంబర్ 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కలిపి 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా, వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ తెలిపారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో మరో 1,500 మంది కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చినట్లు చెప్పారు.మండలానికి సుమారు 306.16 క్వింటాళ్ల అదనపు బియ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఘనత అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలానికి మొదటి విడతలో 401 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 313 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఖాళీ అయిన 88 ఇళ్ల స్థానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో మంజూరు కానున్నాయని తెలిపారు.ఎస్ఐఆర్ రెండో విడతలో ఓటర్లకు అందుతున్న నోటీసులపై కాంగ్రెస్ బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారి ఓటు హక్కు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంతన్న ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.