జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు, అక్టోబర్ 12 వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి విశ్వాసాలతో స్వాములు గురుస్వాముల సమక్షంలో మాలధారణ చేసి, మండల దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.అయ్యప్ప మాలధారణతో ప్రారంభమయ్యే దీక్షాకాలంలో స్వాములు నియమనిష్ఠలు, ఆధ్యాత్మిక చింతన, సాత్విక ఆహారం, బ్రహ్మచర్యం, సేవాభావం వంటి నియమాలను పాటిస్తూ స్వామివారి అనుగ్రహం పొందాలని సంకల్పించారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది