
జనం న్యూస్ : 12 మే మంగళవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో సోమవారం విద్యా, సేవా కార్యక్రమాల సమ్మేళనంగా ఐ ఎఫ్ పీఎస్ ఐడి పి పి ఎస్ ప్యానెల్ ప్రారంభోత్సవం మరియు విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన శుద్ధి చేసిన తాగునీటి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సభలో అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ విద్యార్థినుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా ఇంటర్–2026 వార్షిక పరీక్షల్లో ఎంపిసి గ్రూప్లో 994 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థిని మోకు హారికను సభలో ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రూ.1,00,000 నగదు పురస్కారం అందుకోవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. మోకు హారిక సాధించిన విజయంతో ఇతర విద్యార్థినులకు స్ఫూర్తి లభిస్తుందని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిద్దిపేట విద్యార్థినులు ప్రతి సంవత్సరం విద్యా ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, విద్యార్థినుల భవిష్యత్తుకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మరింత మంది విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.