
జనం న్యూస్ సెప్టెంబర్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:దేశ సేవకు, తెలంగాణ సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఉప సర్పంచ్ ఫోరం నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం యువకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మూడ్ దయానంద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటం, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఆయన తెలంగాణ కోసం నిరంతరం పోరాడారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా, దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని దయానంద్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, కంచరి రమేష్, రత్నయ్య, యువకులు సాంబశివ గౌడ్, కూరాకుల అరుణ్ ముదిరాజ్, తేజ, సున్నపు ప్రసాద్, సాయి కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.