
జనం న్యూస్ అక్టోబర్ 14 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎన్హెచ్–563 అండర్పాస్, సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి – ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు దివంగత శ్రీ తంగెడ గోపాల్రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి ఆహ్వానించారు. అక్టోబర్ 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సూరారం గ్రామంలో నిర్వహించనున్న ఈ ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని తంగడ ఫౌండేషన్, విశ్వ ఆయుర్వేద పరిషత్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్న ఆహ్వానానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి, ప్రారంభోత్సవానికి హాజరవుతానని అంగీకరించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికి గ్రామ సమస్యలపై వినతి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు సూరారం గ్రామస్తులు పలు ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు. జాతీయ రహదారి 563పై పెండింగ్లో ఉన్న అండర్పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో గ్రామ రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. రామాలయ నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం సూరారం గ్రామంలో శ్రీ కొదండ రామాలయ నిర్మాణంతో పాటు శ్రీ ధన్వంతరి మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి గతంలో మంత్రి ఆమోదించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరారం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి సంపత్రావు, భారతీయ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గొంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జె. శ్రీనివాస్ రెడ్డి, ఆలయ నిర్మాణ సేవా బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూరారం గ్రామంలో నిర్వహించనున్న ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించడంతో పాటు, గ్రామ సమస్యల పరిష్కారానికి, ఆలయ నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.