ట్రెండ్ పేరుతో పర్యావరణానికి ముప్పు
జనం న్యూస్ -అక్టోబర్ 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కాలంలో పండుగలు ,పెళ్లిళ్లు, రాజకీయ ర్యాలీలలో ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ విస్తృతంగా కనిపిస్తుంది, ఆకాశంలోకి రంగురంగుల కాగితపు ముక్కలు చిమ్మి(పటాకా బ్లాస్టింగ్ పేపర్లు) హడావుడి హంగామా మధ్య , క్షణాలలో కంటికి విందుగా కనిపించే ఈ ఊరేగింపు మెరుపుల వెనక పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో సహజమైన పూలు, రంగులతో ఊరేగింపు వేడుకలు జరిపేవారు కానీ నేడు తక్కువ ఖర్చుతో ఎక్కువ హంగామా చేయడానికి ప్లాస్టిక్ ఫాయిల్ మరియు కెమికల్ కోటింగ్ ఉన్న బ్లాస్టింగ్ పేపర్ల వైపు యువత ఉత్సాహం చూపుతుంది. కంప్రెస్డ్ ఎయిర్ మిషన్ తో ఈ బ్లాస్టింగ్ పేపర్లు క్షణాలలో వేలాది కాగితపు ముక్కలు గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ రోజులలో ఉపయోగించే బ్లాస్టింగ్ పేపర్లలో చాలావరకు ప్లాస్టిక్ మేళవించిన ఫైని ఫయిల్స్ ఉంటున్నాయి. ఊరేగింపు ముగిసిన తర్వాత ఈ చిన్న కాగితపు ముక్కలు వీధులలో నిండిపోయి ఉంటున్నాయి. పారిశుద్ధ్యపు కార్మికులు సైతం వీటిని శుభ్రపరచలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ కాగితపు ముక్కలలో ఉండే రసాయన పొడుల వల్ల శ్వాస కోశ మరియు కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రభావం ఎంతగానో ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ ఫాయిల్ కు బదులుగా నీటిలో త్వరగా కరిగిపోయే లేదా నెలలో త్వరగా కలిసిపోయే ఎకో ఫ్రెండ్లీ పేపర్స్ ను మాత్రమే ఊరేగింపుల్లో ఉపయోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు, సహజమైన పూలరేకులను ఉపయోగించటం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. స్థానిక అధికారులు పురపాలక సంఘం వారు కూడా ఈ ప్లాస్టిక్ బ్లాస్టర్లపై తగిన నిబంధనలను విధించాలని స్థానికులు కోరుతున్నారు. సంబరాలు వేడుకలు నిర్వహించుకోవడం మన హక్కే కానీ ఆ ఆనందం పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని, బాధ్యతాయుతమైన వేడుకల వైపు అడుగులు వేద్దామని ప్రకృతి ప్రేమికులు పిలుపునిస్తున్నారు.