
జనం న్యూస్ అక్టోబర్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం కేంద్రంలో ఉన్న పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శంకర్ నారాయణ ఇంగ్లీష్–తెలుగు డిక్షనరీలను పంపిణీ చేశారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ డిక్షనరీలను అందజేసినట్లు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు.విద్యార్థులు చదువులో ఉన్నతంగా ఎదగడంతో పాటు, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించుకోవడానికి, ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి డిక్షనరీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి డిక్షనరీలను అందజేసినట్లు వెల్లడించారు.పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తోందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, రాజేందర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, ట్వింకిల్, గంగా మోహన్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.