

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర రైతాంగ సమస్యలు.. వారికి అందించాల్సిన సాయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చిన మాజీమంత్రి ప్రత్తిపాటి. వైసీపీప్రభుత్వంలో ధాన్యం సొమ్ముకోసం రైతులు ఆర్బీకేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. : ప్రత్తిపాటి. జగన్ ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1674కోట్ల ధాన్యం బకాయిని కూటమిప్రభుత్వం చెల్లించింది. : పుల్లారావు కూటమిప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి వరి మద్ధతు పెంపుతో పాటు, దేశవ్యాప్తంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలి : పుల్లారావు గత ప్రభుత్వం వరిరైతుల్ని నిలువునా దోచేసిందని, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి, కొనుగోలు సొమ్ము కోసం, రైతులు కాళ్లు అరిగేలా రైతుభరోసా కేంద్రాల చుట్టూ తిరిగి పెద్దఎత్తున నష్టపోయారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం కొనుగోళ్ల పేరుతో గత ప్రభుత్వం వరి రైతుల్ని దోచేసిన వైనాన్ని, రాష్ట్ర రైతాంగ సమస్యల్ని మాజీమంత్రి ప్రత్తిపాటి సభ సాక్షిగా ప్రజలకు తెలియచేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1674కోట్ల ధాన్యం బకాయిని కూటమిప్రభుత్వం చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల పేరుతో వరి రైతుల్ని నిలువు దోపిడీ చేసిందని, ధాన్యానికి మద్ధతు ధర ప్రకటించలేదని, రైతులు పోరాటంచేసినా జగన్ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదన్నారు. ఆఖరికి ధాన్యం నిల్వకు అవసరమైన గోనెసంచులు (గోతాలు) కూడా ఇవ్వలేకపోయిందన్నారు. గత ప్రభుత్వంలో దళారుల జోక్యం అధికమై రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైసీపీప్రభుత్వం 84,724 మంది వరి రైతులకు రూ.1674కోట్లు బకాయి పెట్టిందని, ఆ సొమ్మును కూటమిప్రభుత్వం ఈ 9 నెలల్లో రైతులకు చెల్లించిందన్నారు. రైతులపై ఏమాత్రం కనికరం, దయలేకుండా వైసీపీప్రభుత్వం నిర్దాక్షణ్యంగా ప్రవర్తించిందన్నారు. కూటమిప్రభుత్వంలో 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతులకు అందుతోంది. 2014-19లో తాను వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 48 గంటల్లోనే రైతులకు ధాన్యం కొనుగోళ్ల సొమ్ము చెల్లించడం జరిగిందన్న మాజీమంత్రి, మరలా ఇప్పుడు అదే విధానాన్ని కూటమిప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ధాన్యం లభ్యత ఆధారంగా కూటమిప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చి, దళారుల జోక్యాన్ని, వ్యాపారుల మోసాలను కట్టడి చేసిందన్నారు. ధాన్యం నిల్వకు అవసరమైన గోడౌన్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రైతుల క్షేమం.. వారి కష్టం గురించి ఆలోచించే నాయకుడు, ప్రభుత్వం అధికారంలో ఉండబట్టే వారి కష్టానికి తగిన న్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర రైతాంగానికి రాయితీపై అందించే వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీపై కూటమిప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని పుల్లారావు కోరారు. వరి మద్ధతు ధర పెంపుపై ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలి…స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు కేంద్రం చొరవ చూపాలి…ధాన్యం రైతులకు ఇస్తున్న ప్రస్తుత మద్ధతు ధర సరిపోవడం లేదని, కేంద్రప్రభుత్వంతో సంప్రదించి, ధాన్యం గిట్టుబాటు ధర పెంచేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, దేశవ్యాప్తంగా సిఫార్సుల అమలు దిశగా కూడా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు, ప్రకృతి విపత్తుల్ని తట్టుకొని వరి రైతులు ధాన్యం పండిస్తున్నారనే వాస్తవాన్ని అందరం గుర్తించాలన్న ఆయన, రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే నిజానికి కూటమిప్రభుత్వం కట్టుబడి ఉండటం సంతోషకరమన్నారు. పంటలసాగు, మద్ధతుధర విషయంలో రైతులు సంతోషంగా లేరని, గత ప్రభుత్వ దోపిడీ విధానాలు, నిర్లక్ష్యంతో దారుణంగా నష్టపోయిన రాష్ట్ర రైతాంగానికి మరింత చేయూతనిచ్చి, న్యాయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపైనే ఉందని పుల్లారావు అభిప్రాయపడ్డారు.