Listen to this article

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో ‘కోర్ట్’ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ, లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ, హీరో హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి, విషిక నగరంలోని హోటల్ దశపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశాఖ సీతమ్మపేట, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథను తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని సహా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారన్నారు. చట్టంపై అవగాహన కల్పిస్తూ, నేటి యువత తప్పుడు దారిలో నడిచే ముందు వారు ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా చిత్రం లోపల అంశాలు తెరకెక్కించడం జరిగిందన్నారు.ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ చిత్రం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. ప్రభుత్వం పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, చిత్రం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది తమ చిత్రం ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రావడం చిత్ర విజయానికి నిదర్శనమన్నారు. సోమవారం విశాఖలో పలు థియేటర్లలో ప్రేక్షకులను స్వయంగా కలవనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి మొల్లేటి, రాజశేఖర్, సురభి ప్రభావతి, విశాఖ కీర్తి ప్రముఖ పాత్రలు పోషించారని వెల్లడించారు. నాని సహా ప్రొడ్యూసర్‌గా ముందుకు వచ్చి నడిపించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.