

జనం న్యూస్ మార్చి19 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) తేది 17.03.2025 రోజున రాత్రి ధర్మారం లోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ నందు గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లు చేయుచున్నారు అనే సమాచారం మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డాక్టర్ జి . అన్నా ప్రసన్న కుమారి, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఇతర వైద్య సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ నర్సింగ్ హోమ్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మరియు పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్ ( గర్భస్థ శిశువు లింగ ఎంపిక నిషేధిత చట్టం) నిబంధనలు సరిగా పాటించని కారణంగా ఆసుపత్రి మరియు స్కానింగ్ సెంటర్ ల రిజిస్ట్రేషన్ లను సస్పెండ్ చేసి, స్కానింగ్ మిషిన్ మరియు ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగినదని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి, డా. జి. అన్నా ప్రసన్న కుమారి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేయడం జరిగినది. ఈ నర్సింగ్ హోమ్ కు 9 బెడ్స్ తో నడుపుటకు అనుమతి ఉండగా 25 కంటే ఎక్కువ బెడ్స్ తో నడుపుచున్నారు. ఈ ఆస్పత్రిలో పునర్నిర్మాణ పనులు అనగా సివిల్ వర్క్స్ నడుచుచుండగా అదే అపరిశుభ్రమైన వాతావరణం లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. కనీస పేషెంట్ భద్రత కూడా తీసుకోవడం లేదు. సరిగా బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ చేయడం లేదు మరియు చట్ట ప్రకారం రెండు సంవత్సరముల వరకు గర్భిణీలకు స్కానింగ్ చేసిన వివరాలను జాగ్రత్త పరచవలసి ఉండగా అలా చేయడం లేదు. డా. లావణ్య, గైనకాలాజిస్ట్ మాత్రమే స్కానింగ్ చేసే అర్హత ఉండగా వారితో పాటు అర్హత లేకున్నా డా శ్రీనివాస్ , ఎం. బి. బి. ఎస్. కూడా స్కానింగ్ చేస్తున్నాడు. డా. లావణ్య వైద్య మరియు ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. వీరికి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేయుటకు అర్హత లేదు. స్కానింగ్ రికార్డులకు, ఫామ్ – ఎఫ్ లకు మరియు ఒ.పి. రిజిష్టర్ లో ఉన్న వివరాలకు పొంతన కలవడం లేదు. ఇలాంటివి గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లను నిర్వహించుచున్నారు అనుటకు అస్కారం కలుగుచున్నవి. అనుమతి లేని డాక్టర్ లు కన్సల్టేంట్ గా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రి గతంలో నోటీసు ఇచ్చినను, సరి చేసుకోకుండా అలానే కొనసాగుచున్నది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడుపు తున్నందున ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ ను సస్పెండ్ చేసి, సీజ్ చేయడం జరిగినది అని అన్నారు. ఈ కార్యక్రమములో స్థానిక పోలీస్ లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి