

కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352,292 కింద కేసులు నమోదు అయ్యాయి. మరో ఫిర్యాదు ఆధారంగా 126 (2),115(2) పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాగ్వాదం కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మంత్రుల ఎదుటే కొట్టుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. వివాదం నేపథ్యంలో అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..