

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఏప్రిల్ 5న జరిగిన దాడికి పాల్పడిన కేసు మిస్టరీని త్వరలో
చేధిస్తామని, నిందితులను త్వరితగతిన కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. దాడి జరిగినట్లుగా సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్, చీపురుపల్లి డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ శివరాం గ్రామంలోని నేర స్థలంకు చేరుకొని, సాంకేతిక ఆధారాలు సేకరించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – గరివిడి మండలం శివరాం గ్రామంలో 18 సం.ల యువతి ఏప్రిల్ 5న ఇంటిలో పనులు చేసుకొంటుండగా, ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడి, గాయపర్చారన్నారు. వెంటనే, గాయపడిన యువతిని చీపురుపల్లి ఆసుపత్రికి, అక్కడ నుండిమెరుగైన వైద్యం కోసం విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ కేసును చేధించేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. నేర స్థలంను ఇప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సందర్శించి, నేర స్థలం నుండి కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించామన్నారు. త్వరలో ఈ కేసు మిస్టరీని ఛేదించి,
నిందితులను అరెస్టు చేసి, త్వరితగతిని ప్రాసిక్యూషను పూర్తయి, నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం పట్టణంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తిరుమల
మెడికవర్ ఆసుపత్రి ఎం.డి. డా|| కే.తిరుమల ప్రసాద్ బాధితురాలికి అందించిన వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి జిల్లా ఎస్పీకి వివరించారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ధైర్యం చెప్పి, ఎటువంటి అధైర్యం వద్దని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించామని, తక్కువ వ్యవధిలోనే నిందితులపై న్యాయ స్థానంలో చార్జిషీటు దాఖలు చేస్తామని, ప్రాసిక్యూషను వేగంగా పూర్తయి, నిందితులు కఠినంగా శిక్షించేబడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితురాలు చెప్పిన ఆధారాలను మేరకు కొద్దిమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నట్లు, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తోపాటు చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు, రాజాం సిఐ కే.అశోక్ కుమార్, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, టూ టౌన్ సిఐ టి.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.