Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

స్వాతంత్ర పోరాట యోధులు, ఆదివాసి ముద్దుబిడ్డ మర్సకోల రాంజీ గోండ్ 164 వర్ధంతి స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాల శ్రీ, మాట్లాడుతూ స్వాతంత్రం కోసం జరిగిన తొలి పోరాటాలలో అనేకమంది ఆదివాసీలు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, స్థానిక రాచరిక పాలన వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. భారతదేశంలో ఆంగ్లేయుల ఆధిపత్యం అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు నడిపిన చరిత్ర ఆదివాసులదనీ అన్నారు.స్వయంపాలన కోసం, ఆత్మగౌరవం కోసం, పరాయి పాలనను వ్యతిరేకించటం ఆదివాసులకు మొదటి నుండి వెన్నతో పెట్టిన విద్యగా ఉన్నది. ఈ తిరుగుబాటు పోరాటాల నుంచి వారసత్వంగా ఆదిలాబాద్‌ అడవితల్లి ఒడి నుంచి ఆవిర్భవించిన ఆదివాసీ విప్లవ జ్వాలే రాంజీగోండ్‌. మధ్య భారతదేశంలో గోండ్వాన ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ గోండుల నాయకత్వంలో రాంజీగోండ్‌ రోహిల్ల తిరుగుబాటు జరిగింది. మధ్య భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాష్ట్రాల్లో నివసించే అనేక ఆదివాసీ తెగల సముహలతో గోండ్వాన రాజ్యం బ్రిటిష్‌ పాలనకు పూర్వమే ఉంది. ఆదివాసి తెగలలో ప్రధానమైన గోండ్‌ తెగ పోరాటానికి, వీరత్వానికి చిహ్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో గోండ్‌, మారియ గోండ్‌ ఉప తెగలు కాగా, మహరాష్ట్ర, ఆంధ్ర, ఒడిశాలలో రాంజీ గోండ్‌, దుర్వగోండ్‌ ఉపతెగలుగా ఉన్నాయి. వీరిని ‘కొయుతుర్‌’గా కూడా పిలుస్తారు. గోండుల పరిపాలన 1240-1750 వరకు సుమారు ఐదు శతాబ్దాల స్వేచ్ఛ, సమానత్వంతో కొనసాగింది.గోండ్వాన రాజ్యన్ని భీమ్‌ బలా సింగ్‌ సిర్పూర్‌ను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఆ తరువాత అతని వారసులు కుర్ణ బలా సింగ్‌, హీర్‌ సింగ్‌, తల్వార్‌ సింగ్‌, కేర్‌ సింగ్‌, రాంసింగ్‌, సుర్జా బలాసింగ్‌ పరిపాలన కొనసాగించారు. సుర్జా బలాసింగ్‌ డిల్లీ సుల్తాన్‌ల సైన్యంతో యుద్ధం చేసి విజయం సాధించాడు. దీంతో సుల్తాన్లు ”షేర్‌ షా” బిరుదును సుర్జాబలాసింగ్‌కు కానుకగా ఇచ్చారు. అందుకే గోండు రాజులు తమ పేరు చివర సింగ్‌కు బదులుగా ”షా” పెట్టుకున్నారు. సుర్జాబలాసింగ్‌ తనయుడు ఖండాయ బలాల్‌ షా రాజదాని సిర్పూర్‌ టీ ని ”చంద్రపూర్‌”కు మార్చాడు. గోండు రాజులు తొమ్మిది మందిలో చివరివాడైన నీల్‌ కంట్‌ షాను మరాఠీలు బందీని చేసి చంద్రపూర్‌ను ఆక్రమించారు. దీనితో గోండ్వాన ప్రాంతం 1750-1802 వరకు మరాఠీల ఆధినంలో ఉంది. మరాఠీ రాజులు బ్రిటిష్‌ వారికి తలొగ్గి గొండ్వానను తెల్లదొరలకు అప్పగించారు. గొండుల పాలన అంతమై ఆంగ్లేయులు, నైజాం పాలనప్రారంభమైనది. వీరి పాలనలో ఆదివాసుల స్వేచ్ఛ హక్కులు పూర్తిగా ధ్వంసంమయ్యాయి. ఆదివాసుల పైన అఖండ నిర్బందాన్ని అమలు చేశారు. బ్రిటిష్ ,నైజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా తమ అస్తిత్వం కోసం హక్కుల కోసం తిరుగుబాటు చేశారు. ఈనేపథ్యంలోనే గోండ్ లలో ధైర్యశాలి మర్సకోల రాంజీ గోండ్‌ 1836-1860 మధ్య కాలంలో జనగాం (ఆసిఫాబాద్‌) కేంద్రంగా బ్రిటిష్‌ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న తొలి ఆదివాసీ గోండ్‌ వీరుడిగా పేరు గాంచాడు.రొహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్‌ తాలుకా నిర్మల్‌ కేంద్రంగా జరిగింది. నాటి గోండులలో పోరాట పటిమ గల రాంజీ గోండ్‌ నాయకత్వంలో తిరుగుబాటు ఉద్రుతమైంది. రొహిల్ల తిరుగుబాటులో కీలక ఘట్టం 1860 మార్చి,ఏప్రిల్‌లో జరిగింది. సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఊట్నూర్‌, చెన్నుర్‌, లక్షెటిపేట్‌ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్‌ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీగోండు నాయకత్వంలో 1000కి పైగా గోండ్‌ ఆదివాసులు, విల్లంబులు, కోడవళ్ళు, తల్వార్‌ ధరించి సాయుధ పోరాటానికి జంగ్‌ సైరన్‌ మోగించారు. ఆదివాసీలు, రొహిల్లలు కలిసి నిర్మల్‌ సమీపంలో కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించారు. తెగించి పోరాటం చేస్తున్న ఆదివాసీలను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. బ్రిటిష్‌ సైన్యంతో సాగిన సాయుధ పోరులో ఆదివాసులు వీరమరణం పొందారు. రాంజీగోండుతో సహా వెయ్యి మందిని పట్టుకొని నిర్మల్‌ నడిబొడ్డున ఉన్న ఊడల ”మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్‌ 9న” ఉరితీశారు.
అందుకే ఆ మర్రి చెట్టు వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది. ఆదివాసుల సాయుధ పోరాటాన్ని, రాంజీగోండు పౌరుషాన్ని తెలియజేస్తూ, నేటి ఆదివాసి సమాజానికి ఆదివాసి ఆత్మగౌరవ పోరాటాలకు సంకేతంగా ఉన్న ఆ మర్రిచెట్టును 1995లో ఈ దోపిడీ పాలకులు నరికివేశారు. ఆదివాసుల చరిత్రను తుడిచి వేశారు. దేశ ప్రథమ స్వాతంత్ర పోరాటం తరువాత బ్రిటిష్‌, నిజాం నిరంకుశ పాలనపై విప్లవ సాయుధ పోరాటం చేసి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన ఘనత తొలి ఆదివాసీ పోరాట యోధుడిగా రాంజీ గోండుకు దక్కింది. నేటి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ మేధావులు, చరిత్రను వెలికి తీయాలి. ముఖ్యంగా ఆదివాసి సమాజానికి తెలియజేయడం కోసం గ్రామ గ్రామాన సభలు నిర్వహిస్తామని తెలిపారు.
*దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో, విప్లవ పోరాట సాహిత్యంలో రాంజీగోండ్‌ గురించి విశ్లేషణాత్మకంగా రాయలేదు. సరైన స్థానం ఇవ్వలేదు. ఇప్పటికైనా నిర్మల్‌లో మర్రిచెట్టు స్థానంలో రాంజీగోండు స్థూపం నిర్మించడానికి ప్రభుత్వం, ఆదివాసీ సంఘాలు, మేథావులు నడుం కట్టాలి.దేశంలో, తెలంగాణలో ఆదివాసీలు అస్తిత్వపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులు రిజర్వు ఫారెస్ట్‌, టైగర్‌ జోన్‌, సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌, యురేనియం నిక్షేపాలు, హరితహారం, పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మంజిల్లాల్లో ఆదివాసీలను గోతిలో పాతి పెడుతున్నారు. ఏజెన్సీ అరణ్యంలో ఉన్న సహజ సంపద, ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు దొడ్డిదారిలో ఇష్టారాజ్యంగా, చట్టవిరుద్ధంగా దోచి పెడుతున్నారు. ఆదివాసులను నిలువుగా నిర్వాసితులను చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడమే ఆయనకు మనమే ఇచ్చే ఘనమైన నివాళి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, నైతం రాజు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గేడo టికానంద్, డివైఎఫ్ ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ చాపిడి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.