

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి.
సింగాపురం వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో విబ్జిఆర్ 2025 ముగింపు వేడుకలు
. జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్
యాదవ్..హుజురాబాద్ విద్యార్థులు పట్టుదలతో చదవాలని, నైపుణ్యానికి పదును పెట్టుకోవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని హుజురాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ జి అన్నారు.. గురువారం హుజూరాబాద్ మండలం సింగాపురంలోని, వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన విద్యార్థి ఉత్సవం “విబ్జిఆర్ 2025” ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి శ్రీనివాస్ హాజరు కాగా.. అతిథులుగా సిఐ తిరుమల్ గౌడ్, డిగ్రీ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ వొడితల, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ షమిత, ప్రిన్సిపాల్ హనుమకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది డిగ్రీ కోర్సు అని అన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న బ్రాంచ్లో అత్యున్నత ప్రతిభ కనబరచాలని, అలాగే నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులకే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, బెట్టింగ్స్, రైడింగ్స్, సైబర్ నేరాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డిగ్రీలో మూడు సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు, అందంగా తీర్చిదిద్దుకుంటారని, లేకుంటే భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశం ఉందని అన్నారు. వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల 20 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఇందులో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం హర్షనీయమని అన్నారు. తదనంతరం హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమని, ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. అకాడమిక్ అడ్వైజర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షమిత మాట్లాడుతూ.డిగ్రీ చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేట్ రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ సాధించవచ్చని అన్నారు. సింగాపురం వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో రాబోయే కాలంలో సివిల్స్ శిక్షణ కూడా ఇస్తామని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏ కళాశాలలో లేని సౌకర్యాలు విఎస్సార్ డిగ్రీ కళాశాలలో ఉన్నాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసే కార్యక్రమాలు ప్రతినిత్యం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో డిగ్రీ విద్య ఉండాలనే లక్ష్యంతో.. సేవా భావంతో వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలను 20 ఏళ్లుగా తమ స్వగ్రామం సింగాపురంలో నిర్వహిస్తున్నామని వివరించారు. తన కళాశాల 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని.. విద్యార్థులు అత్యున్నత స్థానాల్లో స్థిరపడడం హర్షనీయమని అన్నారు. డిగ్రీ విద్యార్థులకు బహిరంగ మార్కెట్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వారు తమ నైపుణ్యానికి పదును పెట్టుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ హనుమకుమార్ మాట్లాడుతూ.. కేవలం అకాడమిక్ సంబంధ పరిజ్ఞానం మాత్రమే విద్యార్థులకు సరిపోదని, ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలిగే విధంగా, ఏ వృత్తినైనా చేపట్టే విధంగా, ఏ ఉద్యోగాన్నైనా చేసే విధంగా విద్యార్థులు తయారు కావాలని సూచించారు. అన్ని రంగాల్లో విద్యార్థులు నైపుణ్యం కలిగి ఉండాలని, తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. *అలరించిన విబ్జిఆర్ 2025* హుజురాబాద్ మండలం సింగాపురంలోని వి ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన విబ్జోర్ 2025 విద్యార్థుల ఉత్సవం అందరిని అలరించింది. విద్యార్థులు తమ ఆటపాటలతో హోరెత్తించారు. విద్యార్థులకు పలు రకాల కాంపిటీషన్స్ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్థానిక ఏసిపి శ్రీనివాస్ జి, సీఐ తిరుమల్ గౌడ్ తమ చేతులమీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

