Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించ నుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇటీవలే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమో దించాయి. అనంతరం రాష్ట్రపతికి పంపగా ఆమోద ముద్ర వేయడంతో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే దీనిపై దేశ వ్యాప్తం గా పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్‌లో అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమ వుతున్నాయి. పలుచోట్ల హింస చెలరేగి నలుగురు మృతి చెందగా.. పదుల కొద్దీ గాయపడ్డారు. అలాగే పోలీసులు కూడా గాయాలు పొందారు.
అయితే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తూ ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా రెండు రకాలైన పిటిషన్లపై ఇవాళ న్యాయ స్థానం విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ. విశ్వనాథన్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యాహ్నం రెండు గంటలకు విచారించనుంది.