Listen to this article

జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు. తాగునీటి సరఫరా, సన్న బియ్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక

సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి

జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు.
ఇందిరమ్మ ప్రజా పాలనతో కూడిన తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. సన్న బియ్యం పంపిణీ,తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ సమస్యలు తలెత్తితే సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రగతి గురించి మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యవసాయం, తాగునీటి సరఫరా, మార్కెటింగ్, పౌర సరఫరాలు, హౌసింగ్, భూభారతి
తదితర శాఖల అమలు తీరుపై మంత్రి సమగ్ర చర్చ జరిపారు. ప్రస్తుత వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలలో, ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు. అధికారులు వాస్తవ నివేదికలు ఇవ్వాలని, తాము క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామని, ఏమైనా తేడాలు ఉంటే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాను పక్కగా పర్యవేక్షిస్తూ, సంబంధిత నీటి పథకాల నిర్వహణ జరుపుతున్న ఏజెన్సీలకు పక్కగా లెక్కింపులతోనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి ప్రతీరోజూ కనీసం వంద లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 150 లీటర్ల చొప్పున నీటి సరఫరా జరగాలన్నారు. ఆర్మూర్ పట్టణానికి అమృత్ పథకం కింద 43 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, తాగునీటి సరఫరాను మెరుగుపరిచే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, రోడ్డు నిర్మాణాలు, మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను విచారణ జరిపి బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి జూపల్లి కలెక్టర్ కు సూచించారు.
పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ, జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని, నిజామాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు సన్న బియ్యం సరఫరా చేస్తుండడం అభినందనీయం అని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ, జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. కాగా, జిల్లాలో యాసంగిలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా కాగా, వాటిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,ఇప్పటికే 426 కేంద్రాల ద్వారా రూ. 562 కోట్ల విలువ చేసే 2.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం అయిన వెంటనే రైతులకు పూర్తి వివరాలతో రసీదులు అందించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. తాగునీటి సరఫరా, ధాన్యం అమ్మకం వంటి అంశాలలో ప్రజలకు, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ తో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందేలా కృషి చేయాలని హితవు పలికారు.
కాగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకూడదని, ఎక్కడైనా అవినీతి అక్రమాలకు తావిస్తే రికవరీ చేయిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఇళ్ళను నిర్మింపజేసి, ఆ తరువాత బిల్లులను మహిళా సంఘాలకు అందించేలా చొరవ చూపాలని అన్నారు. కనిష్టంగా 400 స్క్వేర్ ఫీట్లు, గరిష్టంగా 600 స్క్వేర్ ఫీట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. సన్న బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ జరపాలని, రేషన్ డీలర్ల ఖాళీలను నెల రోజుల్లోపు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, అన్ని రేషన్ దుకాణాలకు సరైన నిష్పత్తిలో కోటా కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల ఇబ్బందులు పడిన రాష్ట్ర రైతాంగానికి ఊరట కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తెచ్చిందని అన్నారు. ఈ నూతన చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని, మండల, గ్రామ స్థాయిలో రైతులతో సదస్సుల నిర్వహణ కోసం నిర్ణీత షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా రెండు రోజుల్లోపు వాటిని అందించాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ పక్షం రోజుల్లో మంజూరీలు తెలిపేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా ఇంటింటి సర్వే ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్,
అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.