

జనం న్యూస్, ఏప్రిల్ 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
సంగీత వాయిద్యమైన కీబోర్డ్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బోయిని ప్రసాద్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరెన్నో ప్రపంచ రికార్డులు అందుకోవాలని పలువురు సంగీత అభిమానులు కోరారు.గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన హలేల్ సంగీత పాఠశాల ద్వారా ప్రపంచ స్థాయిలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజిక్ ప్రదర్శన జరిగింది. ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొన్న 1046 మంది విద్యార్థులు గంట సమయంలో కీబోర్డు వాయించి తమ ప్రతిభను కనబరచుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకోగా.. అందులో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన భూం నగర్ నివాసి బోయిని ప్రసాద్ కూడా ఉన్నారు.
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ బృందంలో వీరి ప్రతిభను గుర్తించిన వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆనంద్ రాజన్, హలేలు మ్యూజిక్ పాఠశాల వ్యవస్థాపకులు అగస్టీన్ దండింగి ఏప్రిల్ 14 న సర్టిఫికేట్ తో పాటు మెడల్ అందించారు. ఈ ఘనత సాధించిన బోయిని ప్రసాద్ ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు అభినందించి , భవిష్యత్తులో అత్యుత్తమ సంగీత ప్రతిభను ప్రదర్శించి, ప్రపంచ రికార్డులు మరిన్ని పొందాలని దీవించారు.