

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇన్నగంటి జగదీష్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని, ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం తో నాయకులు హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ … గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దాని పై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక పై కేబినెట్ చర్చించి, వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైందని, మాల, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. వీరిలో మాదిగలు 67,02,609 కాగా, మాలలు 55,70,244. మాదిగల జనాభా మాలలకంటే 11,32,365 మంది ఎక్కువ అని అన్నారు. 1997 లో ఏ, బీ, సీ, డీ గా వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమం ఉప్పెనలా సాగడంతో షెడ్యూల్డ్ కులాల మధ్య నెలకొన్న సామాజిక అసమానతలు అధ్యయనం చేసేందుకు 1996 సెప్టెంబర్ 10న రామచంద్రరాజు కమిషన్ ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండ్ కు అనుకూలంగా తీర్మానం చేశారని అన్నారు. 1997 జూన్ 6న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ జీవో ప్రకారం ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించారని అన్నారు. ఎస్సీ ఉప వర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం, గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదంతో అందరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఏ గ్రూపులో రెల్లి సహా 12 కులాలు, బీ గ్రూపులో మాదిగ సంబంధిత 18 కులాలు, సీ గ్రూపులో మాల కులస్తులతో పాటు మరో 24 కులాలు, డీ గ్రూపులో ఆది ఆంధ్ర కులాలను చేర్చారని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఎస్సీ లందరు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జి.పి కుమార్, ఎస్సీ నాయకుడు ఎం. ప్రభాకర్ పాల్గొన్నారు.