

మృతులకు అశ్రు నివాళులు పోలాడి రామారావు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
పహిల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన 25 మంది అమాయక హిందువులకు అశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. మారణ కాండ సృష్టించిన ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని,ఇందుకు బాద్యులైన పొరుగున ఉన్న దాయాది దేశానికి గట్టి జవాబ్ చెప్పాలని పోలాడి డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఒక వర్గం టూరిస్టులపై ఏరికోరి కిరాతకంగా అమానమీయంగా కాల్పులు జరిపి 25 మంది ప్రాణాలు బలిగొనడం దారుణమైన సంఘటన అని తీవ్ర దిగ్భ్రాంతి వేదనకు గురి చేసిందని పోలాడి రామారావు విచారం వ్యక్తం చేశారు.గురువారం నగరానికి వచ్చిన రామారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాశ్మీర్ ఉగ్ర మూకల మారణ కాండలో 25 మందికి పైగా అమాయక టూరిస్టులను కాల్చి చంపడం దారుణ, హేయమైన, క్రూర చర్య అని తీవ్రంగా ఖండించారు. ఉగ్రమూకల దాడులలో అమాయకులు, కీలక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, టూరిస్టులు నెలకొరగడం యావత్ భారతీయులందరిని కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టు దిట్టమైన ఏర్పాటు చేయాలని
టూరిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. అమానమీయ ఘటనను నిరసిస్తూ మానవ హారం నిర్వహించి ప్రజలను చైతన్య వంతం చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ప్రజా సంఘాల నాయకులు 2 నిముషాలు మౌనం పాటించారు. దేశంలో ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు జరిగినప్పుడు జాతి యావత్తు ఒకటిగా నిలిచి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమిష్టి బాధ్యత మనందరిపై ఉందని, ఇలాంటి అంశాలలో రాజకీయాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ప్రజా సంఘాల తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, దేశ పౌరులతో పాటు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు, విద్యా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపి దేశ సమగ్రతకు భారత జాతి ఐక్యత చాటాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.