Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : పొగాకు రైతుల సమస్యలపై తనను కలిసిన వ్యవసాయ, రైతు సంఘాల నేతలతో ప్రత్తిపాటి బర్లీ పొగాకు రైతుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, పొగాకు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు, ఇతర అంశాలపై ప్రభుత్వం సంబంధిత అధికారులు, విభాగాలతో సంప్రదింపులు జరుపుతోందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బర్లీ పొగాకు రైతుల ఇబ్బందులను తెలియచేస్తూ నియోజకవర్గ వ్యవసాయ, రైతు సంఘాల నాయకులు శనివారం ప్రత్తిపాటికి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో బర్లీ పొగాకు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటదిగుబడి బాగానే ఉన్నా ఉత్పత్తులు కొనేవారు లేక సాగుదారులు బోరుమంటున్నారని, సమస్య పరిష్కారంపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని రైతుసంఘం నేతలు మాజీమంత్రిని కోరారు. వారు చెప్పింది సావధానంగా విన్న ప్రత్తిపాటి, సమస్య తీవ్రత, రైతుల ఇబ్బందులు తనకు తెలుసునని, వాటిగురించి గతంలోనే ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందన్నారు. పొగాకు కంపెనీలు రైతుల్ని నమ్మించి మోసగించాయని, వాటి పనితీరుపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని ప్రత్తిపాటి సంఘనాయకులకు చెప్పారు. సమస్యపై వ్యవసాయమంత్రితో, ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన వారితో చెప్పారు. రైతులు, వ్యవసాయసంఘాల నేతలు, రాజకీయపార్టీల నాయకులు ఒక కమిటీగా ఏర్పడి, సమస్య తీవ్రతను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని ప్రత్తిపాటి సూచించారు. మాజీమంత్రికి వినతిపత్రం ఇచ్చినవారిలో కొల్లా రాజమోహన్ రావు, సిపిఐ, సీపీఎం, రైతు నాయకులు తదితరులున్నారు.