Listen to this article

తీర ప్రాంత పరిరక్షణ సాధ్యమేనా?

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 17 (జనం న్యూస్):-

సింగరాయకొండ: రాష్ట్రం లో తీర ప్రాంత విస్తీర్ణం అత్యధిక శాతం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అటు బాపట్ల జిల్లా మధ్య ఉంది ప్రకాశం జిల్లా తీర ప్రాంతం.విశాలమైన తీర ప్రాంత పరిరక్షణ,సముద్ర మార్గం కేంద్రంగా చేసుకుని దేశ సమగ్రత, పటిష్టతని దెబ్బ తీసే విధంగా తీవ్ర వాదుల కదలికలు, అక్రమ చొరబాటు దారులు నేరస్తుల నియంత్రణ తీర ప్రాంత పరిరక్షణని దృష్టి లో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా తీర ప్రాంత పరిరక్షణ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు కు చర్యలుంచేపట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రామాయపట్నం కేంద్రంగా అరవై మంది సిబ్బంది తో ప్రత్యేక మెరైన్ పోలిస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాశం జిల్లా తీర ప్రాంతం ఉంటుంది. రామాయ పట్నం కేంద్రంగా నిత్యం తీర ప్రాంత గస్తీ కి ప్రత్యేకించి మెరైన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటుంది. అప్పటి ప్రభుత్వం సిఐ తో పాటు ఇద్దరు ఎస్సై లు, ఇద్దరు ఎఎస్సై లు,ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లు,ఆరుగురు హోమ్ గార్డ్ లు తోపాటు,మరో నలభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది తో మెరైన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసింది.అయితే వివిధ కారణాల తో ప్రస్తుతం కేవలం ఇరవై మూడు మంది సిబ్బంది తో మాత్రమే మొక్కుబడిగా స్టేషన్ నిర్వహణ జరుగుతుంది. సిఐ, ఇద్దరు ఎస్సై లు,ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లు ఆరుగురు హోమ్ గార్డ్ లతోపాటు మరో పన్నెండు మంది పోలీస్ సిబ్బంది తో స్టేషన్ నిర్వహణ తీరప్రాంత పరిరక్షణ విధులు నిర్వహిస్తున్నారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎ ఎస్సై లు బదిలీ పై వెళ్ళారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పని చేస్తున్న సిబ్బంది దశాబ్దం పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారని వీటికి ఏటువంటి బదిలీలు లేవంటే ఎంత ఉదాసీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తగిన సిబ్బంది లేకుండా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించేందుకు ఏవిధంగా వీలు పడుతుంది అని ఆలోచించే అధికారి గానీ ప్రజా ప్రతినిధులు గానీ ప్రభుత్వం గానీ లేకపోవడం గమనార్హం. సింగరాయకొండ మండలం కేంద్రంగా పాకల సముద్ర తీరంలో మెరైన్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినా ప్రత్యేక వ్యవస్థ కల్పించినా ఫలితం శూన్యం. ఈ తీరంలో తరచు పర్యాటకులు, భక్తులు సముద్ర స్నానానికి రావడం ప్రమాద వశాత్తూ సముద్రం లో స్నానం చేస్తుండగా సముద్రం లోనికి కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి పండుగలు, పరవడి రోజులు, ప్రత్యేక రోజులలో పర్యాటకులు భక్తులు విశేషంగా పాకల బీచ్ కి వచ్చి సముద్ర స్నానాలు చేస్తుంటారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో హడావుడి చేసే ప్రభుత్వ యంత్రాంగం సమన్వయ లోపంతోనో, పని వత్తిడి ఎక్కువగా ఉండడం తోనో,సిబ్బంది కొరతతో కారణంగానో, సిబ్బంది ఇబ్బందుల వల్ల నో ముందస్తు జాగ్రత్తలు, ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రణాలికలు, బందో బస్తు వ్యూహాలు,లా అండ్ ఆర్డర్ పోలీస్, మెరైన్ పోలీసు, పంచాయితీ, రెవెన్యూ, మత్స్య శాఖ,పర్యాటక శాఖ సమన్వయం లోపం కారణంగానో తరచు ఇలాంటి సంఘటనలు ప్రమాదాలు మరణాలు చోటు చేసుకుంటు న్నాయి. ఇప్పటి కైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మెరైన్ పోలీసు స్టేషన్ కి పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేసి తగిన వసతులు కల్పించడం తో పాటు వనరులు మెరుగు పరిషత్ తీర ప్రాంతానికి, ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో హడావుడి చేయడం కాకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రణాళిక తో తీర ప్రాంత పరిరక్షణ మృతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.