Listen to this article

30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం..

రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు..

భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుందని, రైతుల భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
సోమవారం నాడు వీణవంక మండలం చల్లూరు, లోని రైతువేదిక నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం 2025 రూపొందించిందని తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం సమస్యల ను సంబంధిత అధికారి ఎన్ని రోజులలో పరిష్కరించాలనే విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. అధికారి పరిష్కరించిన భూ సమస్యపై సంబంధిత అర్జీదారు సంతృప్తి చెందని పక్షంలో అప్పీలు వ్యవస్థను ఈ చట్టంలో పొందుపరిచారని తెలిపారు. కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారని తెలిపారు.గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. గతంలో తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం అయ్యే చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవని అన్నారు. వేల సంఖ్యలో దరఖాస్తులు ఉండడంవల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేదని తెలిపారు. భూభారతి ద్వారా కిందిస్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారని, దీనివల్ల చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. భూమికి భూదార్ సంఖ్య కేటాయింపునకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలు అరికట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. ధరణిలో ఇప్పటికే దరఖాస్తు చేసిన వారి సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భూ భారతిలో మ్యుటేషన్ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ క్షేత్రస్థాయిలో విచారించి రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రమేష బాబు, తహసిల్దార్ శ్రీనివాస్, వివిధ వర్గాల ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.