



జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ కార్యాచరణ అమలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై నిర్వహించిన సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
జనం న్యూస్,మే 03, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డి.సి.పి కరుణాకర్ తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో అధికంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఉండాలని అన్నారు. పెద్దపల్లిలోని కూనారం జంక్షన్, కమాన్ జంక్షన్, బస్ స్టాండ్ జంక్షన్, మంథని ఫ్లైఓవర్ వద్ద సాధ్యమైన మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని, అవసరమైన లైటింగ్ సౌకర్యం కల్పించాలని, జంక్షన్ల కంటే ముందు ఇరు వైపులా అవసరమైన బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రహదారి పిచ్చి మొక్కల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లారీలు, ట్రాక్టర్ లు, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజీవ్ రహదారి పై అవసరమైన చోట పోలీస్, ఆర్.టి.ఓ అధికారుల సమక్షంలో రంబల్ స్ట్రీప్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.రహదారి పై అవసరమైన చోట హై మాస్ లైటింగ్ కోసం ప్రతిపాదనలు అందించాలని అన్నారు. రహదారి పై టర్నింగ్ దగ్గర వెంటనే రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై విస్తృత ప్రచారం కల్పించాలని, జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులను, యాక్సిడెంట్ ఏరియా లో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈ ఈ భావ్ సింగ్ , పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏసీపీలు రమేష్ ,కృష్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు బండి ప్రకాష్, ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.