

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని
* యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన డి.ఆర్.డి.ఓ
జనం న్యూస్, మే 07, పెద్దపల్లి జిల్లా ప్రతినిధిప్రతి దివ్యాంగుడికి యూ.డి.ఐ.డి నెంబర్ పై అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని అన్నారు.మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, జడ్పీ సీఈఓ నరేందర్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని మాట్లాడుతూ, అక్టోబర్ 31, 2023 నాటికి జారీ చేసిన సదరం సర్టిఫికెట్లకు యూ.డి.ఐ.డి కార్డు నెంబర్ జనరేట్ చేసి దివ్యాంగులకు పంపిణీ చేశామని అన్నారు. దివ్యాంగులకు ఎవరికైనా యూ.డి.ఐ.డి నెంబర్ లేని పక్షంలో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా యూ.డి.ఐ.డి పోర్టల్ నందు తెలుసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 1, 2023 కంటే ముందు సదరం సర్టిఫికెట్ ఉండి, యూ.డి.ఐ.డి కార్డు లేని దివ్యాంగులు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదిస్తే జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు యు డి ఐ డి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా అందుతుందని అన్నారు.గుడ్డి వారు, లో విజన్, కుష్టి వ్యాధి గ్రస్తులు, వినికిడి సమస్య గలవారు, అంగవైకల్యం గలవారు, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి యూ.డి.ఐ.డి కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రి లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని, నిర్దారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూ.డి.ఐ.డి కార్డు జనరెట్ చేయాలని అన్నారు.యు డి ఐ డి కార్డుల జారీ, వాటి వినియోగం పట్ల దివ్యాంగులకు ఉన్న వివిధ సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.ఈ సమావేశంలో ఎంపీడీవోలు, భవిత సెంటర్ నిర్వాహకులు, దివ్యాంగులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.