Listen to this article

కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు

సృష్టిలో దేవుడి మరో రూపం అమ్మ

జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్-సృష్టికి ప్రతిరూపం అమ్మ, మనందరికీ అపురూపం అమ్మ, దేవుడి మరో రూపం అమ్మ, బిడ్డను కనుపాపలా, కంటికి రెప్పలా కాపాడి ఈ సమాజానికి అందించేదే అమ్మ. కుబేరుడి రుణం వెంకటేశ్వరుడు తీర్చగలడేమో గానీ అమ్మ రుణం మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. పేగును, రక్తానే కాదు తన జీవితాన్ని సైతం మనకు పంచి ఇచ్చేదే అమ్మ. ఇలా ఎన్ని చెప్పుకున్నా అమ్మ గురించి తక్కువే. మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకునే గొప్ప ఔదార్యత ఒక తల్లికే సాధ్యం.
ప్రతి ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది.ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.మన భారతీయ సమాజం సైతం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం.. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి… ఓ అనుబంధం… ఓ ఆప్యాయత…ఓ ఆత్మీయత.. ఓ అనురాగం.. మాటలకు అందని మధురానుభూతి.