

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్
జనం న్యూస్ 16 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంమైన సేవలందించేందుకు “ఈ-ఆఫీస్”
విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ప్రభుత్వం డిజిటలైజేషను దిశగా అడు గులు వేస్తూ, కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంగా సేవలందించేందుకు “ఈ-ఆఫీసు” విధానాన్ని ప్రారంభించిందన్నారు. ఈ-ఆఫీసు విధానంతో అధికంగా పేపర్లును వినియోగించకుండా, వేగవంతంగా సేవలందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్ ఫైళ్ళు, నిర్ణయాలు మరియు అధికారుల మధ్య సమాచార
మార్పిడి పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలోనే జరుగుతుందన్నారు. “ఈ-ఆఫీసు” విధానాన్ని పరిపాలనలో వినియోగం వలన కార్యాలయ సిబ్బందికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా, ఫైళ్ళకు భద్రత పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఫైల్స్ పాడయ్యాయి, కాలిపోయాయి, చిరిగిపోయాయన్న ఇబ్బందులు ఉండవన్నారు. కావున, పోలీసు కార్యాలయ సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, నిపుణులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని పోలీసు కార్యాలయ ఉద్యోగులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఈ-ఆఫీసు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసరు ఆర్.నరేంద్ర మాట్లాడుతూ – ఈ-ఆఫీస్ వినియోగించడం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఎంత పనినైనా సులువుగా చేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతీ రోజూ అర గంట సమయాన్ని ఈ-ఆఫీసు పట్ల అవగాహన కోసం వినియోగిస్తే, సులువుగా నిష్ణాతులు కావచ్చునన్నారు. ఈ-ఆఫీసు వినియోగించడం వలన పంపిన ఫైల్స్ ఎవరి వద్దన పెండింగులో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చునని డిఐఓ ఆర్.నరేంద్ర అన్నారు. ఈ-ఆఫీసు శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సామ్యలత, డిఐఓ ఆర్.నరేంద్ర, ఎఓ పి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, రామకృష్ణ, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.