

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ పోరాటం
అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ అండగా నిలుస్తోందని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురారావు అన్నారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు అందజేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లరి బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నివేశన స్థలాలు ఇస్తామని ప్రకటించిందని అయితే లబ్దిదారుల ఎంపిక, నివేశన స్థలాల కోసం స్థల సేకరణ తదితర అంశాలపై ఇంతవరకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధించి కార్యచరణ వేగవంతం చేయాలన్నారు. సంవత్సరాల తరబడి పేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారని, చాలిచాలనీ ఆదాయంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారాయని, ఇటువంటి తరుణంలో ఇంటి అద్దెలు చెల్లించటం పేదలకు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని, ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం పట్టణాలు, గ్రామాలకు దూరంగా నివేశ యోగ్యం కాని ప్రదేశాలలో సెంటు స్థలం కేటాయించారని విమర్శించారు. పేదల పక్షాన వారి సమస్యలపై పోరాడటానికి సీపీఐ సిద్దంగా ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అందేజేయాలన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం సీపీఐ ప్రజల తరుఫున పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు మల్లికార్జున్,రాము,నవీన్, అంజయ్య, చౌటుపల్లి నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.