

జనం న్యూస్ జూన్ 04
:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో బుధవారం రోజునా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు వ్యవసాయ పాలిటెక్నిక్, రుద్రూర్ శాస్త్రవేత్తలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరింగింది. ఈ సందర్బంగా డా. బి మంజు భార్గవి. శాస్త్రవేత్త, సేద్య విభాగం విభాగం,ప్రాంతీయ వరి పరిశోధన స్థానం మరియు వ్యవసాయ పాలిటెక్నిక్ రుద్రూర్ రైతులకుఉద్దేశించి వివిధ అంశాల పైన అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడండి- సాగు ఖర్చు తగ్గించండి. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి -నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడండి. రసీదులను భద్రపరచండి- కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందండి. సాగు నీటిని ఆదా చేయండి -భావితరాలకు అందించండి. పంట మార్పిడి పాటించండి -సుస్థిర ఆదాయాన్ని పొందండి. చెట్లను పెంచండి- పర్యావరణాన్ని కాపాడండి.
యూరియా మరియు ఇతర ఎరువుల వాడకం, తెగుళ్ళు మరియు పురుగు మందుల వాడకం, రశీదు తీసుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం మొదలగు అంశాల మీద అవగాహన కల్పించారు.సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలని లేని యెడల పురుగులు, తెగుళ్ళ ఉధృతి పెరగడమే కాకుండా పర్యావరణ కాలుష్యంతో పాటుగా పెట్టుబడులు పెరిగిపోతాయని సూచించారు. వేసవిలో పంట కోత అనంతరం లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగుళ్ళు, పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా నేల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని సూచించారు. విత్తన శుద్ధి ప్రాముఖ్యత, లాభాలు మరియు వివిధ పంటల్లో విత్తన శుద్ధి చేసుకునే విధానాలు గురించి వివరించారు.
ప్రస్తుతం నెలకొంటున్న వాతావరణ మార్పులను వివరిస్తూ పంట మార్పిడి సరైన ప్రణాళికతో చేస్తే రైతుకు ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు మరియు భూమికి దీర్ఘకాలిక ఆరోగ్యం కలుగుతుందని, వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా పొలానికి అవసరమైన సమయంలో నీరు అందించవచ్చు, వానాకాలం పంట సాగు తరువాత యాసంగి లేదా వేసవి పంటలకు నీరు అందించడం సులబమవుతుందని వివరించారు. చెట్లు నాటడం మన జీవన వ్యవస్థకు అత్యంత అవసరమైన పని, ఇది కేవలం పర్యావరణ పరిరక్షణకే కాదు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించడానికీ కీలకమైన చర్య అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులుతమ సమస్యలను తెలుపుతూ వారికి వరి దుబ్బులను కాల్చకుండా కలియదున్నే పద్దతులు, వివిధ పురుగులు మరియు తెగులు యాజమాన్య, పచ్చి రోట పంటలు గురించి అడిగి తమ సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకున్నారు.మండల వ్యవసాయ అధికారి ఎస్. వైష్ణవ్ రైతులకు పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత తెలిపి, రైతులకు ప్రభుత్వం తరపున జనుము, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. మంజు భార్గవి, మండల వ్యవసాయ అధికారి ఎస్. వైష్ణవ్, పశువైద్యురాలు డాక్టర్ రాజ్య లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య , వ్యవసాయ విస్తరణ అధికారి సాయి సచిన్, రైతులు మరియు మహిళా రైతులు పాల్గొన్నారు.
