Listen to this article

జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 11.

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిజామాబాద్ జోన్ పరిధిలో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వీలుగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. వివిధ శాఖల సహకారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, నిర్వహించిన దాడులు, స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల గురించి ఆ విభాగం నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇటీవలి కాలంలోనే సుమారు రూ. 42.98 కోట్ల విలువ చేసే ఆల్ఫ్రాజోలం నిల్వలను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అల్ఫ్రాజోలం విక్రేతలను పట్టుకుని పకడ్బందీ విచారణ జరపడం ద్వారా పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని పలు జిల్లాలలో వాటి మూలాలు ఉన్నట్లు కనుగొని అనేక కంపెనీలపై దాడులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయని అన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనితీరును అదనపు కలెక్టర్ అభినందిస్తూ, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించే దిశగా అంకితభావంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే, వీటి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని అదనపు కలెక్టర్ గుర్తు చేశారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చని అదనపు కలెక్టర్ ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారని అన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.