Listen to this article

జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఆండ్ర పోలీసు స్టేషనులో ఎస్ఐగా పని చేస్తున్న కే.సీతారాం డయల్ 100/112 కాల్ కు సకాలంలో స్పందించి,
సంఘటనా స్థలంకు చేరుకొని, రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇరువురి ప్రాణాలను కాపాడి, ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించినందుకుగాను ఎస్ఐ కే.సీతారాంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జూన్ 11న ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్ళితే.. జూన్ 10, రాత్రి సుమారు 8గంటల సమయంలో ఆండ్ర పోలీసు స్టేషనుకు డయల్ 100/112కు బిరసాడవలన గ్రామ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందింది. వెంటనే ఆండ్ర ఎస్ఐ కే.సీతారాం హూటాహూటిన పోలీసు స్టేషనుకు 8 కి.మీ. ల దూరంలో ఉన్న బిరసాడ వలస గ్రామ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వద్దకు చేరుకొని, రహదారి ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో జాతీయ రహదారిపై పడి, రక్తస్రావం అవుతున్నన్నట్లుగా గుర్తించి, సమాచారాన్ని 108కు అందించారు. రాత్రి కావడం, జాతీయ రహదారిపై ఎవ్వరూ కనబడక పోవడంతో సమీప గ్రామానికి వెళ్ళి, గాయపడిన ఇరువురిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం, గ్రామస్థులు, 108 సిబ్బంది సహకారంతో సహకారంతో గాయవడిన ఇరువురిని అంబులెన్సులో ముందుగా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రధమ చికిత్స అందించారు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆనుపత్రికి తరలించడంతో అనంతరగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం గ్రామానికి చెందిన (1) గెమ్మెల రాంబాబు (2) గెమ్మెల అప్పలస్వామి ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం గాయపడిన ఇరువురి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
డయల్ 112/100కు సకాలంలో స్పందించి, గాయపడిన వ్యక్తులను త్వరితగతిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా, సమయస్ఫూర్తితో నిర్వహించిన ఆండ్ర ఎస్ఐ కే.సీతారాంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు నిలిపిన ఆండ్ర ఎస్సైకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.