Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్):- బాపట్ల జిల్లా : అద్దంకి మండలం ధేనువకొండ సమీపంలో మట్టి తరలించేందుకు తవ్వకాలు జరుపుతుండగా పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి… ఇవి క్రీస్తు పూర్వం 10 శతాబ్దం నుంచి 5వ శతాబ్దానికి చెందిన మనుషుల సమాధులుగా గుర్తించారు… 2,500 ఏళ్లనాటి సమాధులు అని చారిత్రక పరిశోధకులు పరిశీలించి ధృవీకరించారు. అలాగే జె. పంగులూరు మండలం రామకూరు, సంతమాగులూరు మండలం ఏల్లూరుల్లో కూడా ఇదే కాలం నాటి సమాధులు ఇటీవల గుర్తించారు. దాదాపు రెండు వేల ఐదువందల ఏళ్ల నాడు అనాటి సమాజంలోని మనుషులు చనిపోతే ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లో పూడ్చి పెట్టేవారు. జంతువులు, సమాధులను తవ్వకుండా ఉండేందుకు వాటిపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంచేవారు. ఈ సమాధి పొడవు 7 అడుగులు, వెడల్పు 4 అడుగులు, లోతు మరో 4 అడుగులు ఉండేలా ఏర్పాటు చేసినట్టు తాజాగా ధేనువకొండ సమీపంలో వెలుగులోకి వచ్చిన సమాధుల ద్వారా తెలిసింది… సమాధిలో మృతదేహంతో పాటు మట్టికుండ ఉంచి అందులో ఆహారపదార్ధాలు ఉంచారు… సమాధికి మూడు వైపులా రాళ్లు ఉంచి, పైన పొడవైన రాయి పరిచారు… సమాధిపై భాగం చుట్టూ గుండ్రంగా రాళ్లు పేర్చారు… ఇది ఆనాటి ఆచారంగా ఉండేదని భావిస్తున్నారు… దీంతో ఆనాటి ప్రజలు వ్యవసాయం చేయడమే కాకుండా నాగరిత కలిగిన సమాజంలో ఉన్నట్టు తెలుస్తోందని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. సమాధుల్లో ఉంచిన మట్టికుండల ఆనవాళ్ళపై నగిషీలు చెక్కి ఉండటంతో కళలు కూడా వికసించి ఉండేవని అంటున్నారు… దేనువకొండ సమీపంలో మట్టి తవ్వుతుండగా వెలుగులోకి వచ్చిన ప్రాచీన సమాధులు తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయినట్టు గుర్తించారు… ఈ ప్రాంతాన్ని అద్దంకి తహసీల్దార్‌ సింగయ్య, చారిత్రక పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి పరిశీలించారు.ఈ ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేపట్ట రాదని అధికారులు ఆదేశాలు జారీచేశారు.