

జనం న్యూస్ జనవరి 23(నడిగూడెం):- 2025-26 విద్యా సంవత్సరానికి గాను సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి గాను దరఖాస్తులు చేయించాలని ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి కోరారు. గురువారం సమ భావన సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. గ్రామాల్లో ప్రచారం చేపట్టి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా సహకరించాలని మహిళా సంఘాల సభ్యులను ప్రిన్సిపాల్ కోరారు. ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశారు. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం రామలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.