Listen to this article

జనంన్యూస్ నిజామాబాద్, జూన్ 24 :

వచ్చే ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణా రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ భాగస్వాములయ్యారు.
వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాల పై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. 2లక్షల 30 వేలకు పైగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని, లక్షకు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ అయ్యాయని సీ.ఎస్ అన్నారు. భారీ వర్షాలు కురియక ముందే ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరిగేలా చూడాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, సీనరేజీ ఛార్జీలను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ప్రస్తుతం ఎంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందో ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని, ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని అన్నారు.కాగా, పిఎం ఆవాస్ యోజన అర్భన్ 2.0 కింద రాష్ట్రానికి లక్షా 13 వేల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు.వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఇండ్లకు పంపిణీ చేసే మొక్కల పెంపకం సైతం పరిశీలించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ప్రతి జిల్లా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని, నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత స్టాక్ పై రివ్యూ పెట్టాలని అన్నారు. జూలై వరకు అవసరమైన స్టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, సెప్టెంబర్ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్ ప్రొక్యూర్ చేస్తున్నామని అన్నారు. ఎరువుల స్టాక్ ను ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.రిటైల్ విక్రయాలను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల షాప్ వద్ద ఎక్కడ కొరత రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు ప్రస్తుత సంవత్సరం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రైతులకు లాభసాటి పంట ఆయిల్ పామ్ పట్ల అవగాహన కల్పిస్తూ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా దాదాపు 8 లక్షల 27 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సాధా బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.డెంగ్యూ, మల్లేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన కల్పన, పర్యవేక్షణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వల్నరబుల్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి లక్షణాలు గల ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అన్నారు.ఆన్ లైన్ నుంచి వీసి లో పాల్గొన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు.గతం కంటే మెరుగ్గా ప్రజల్లో వన మహోత్సవం కార్యక్రమం తీసుకుని వెళ్ళాలని, ప్రతి రోజూ ఒక్కో శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వసించాలని అన్నారు. జిల్లాలో వి.ఐ.పి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలో ఎత్తైన మొక్కలు నాటి వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అటవీ ప్రాంతంలో కోతులకు అవసరమైన పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున బ్లాక్ ప్లాంటేషన్ పెంచాలని అన్నారు. జిల్లాలకు కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాలను కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే జిల్లాకు 19,490 ఇండ్లు కేటాయించగా, 15,834 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ ప్రొసీడింగ్స్ అందించామని, 7181 ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ జరిగిందని, ప్రస్తుతం వివిధ దశలలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ, లబ్ధిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అలాగే, జిల్లాలో 7075 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎస్ దృష్టికి తెచ్చారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.