

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రహరీ గోడ (కాంపౌండ్) సాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుని బహుజన సంక్షేమ సంఘం(బీఎస్ ఎస్), బహుజన స్టూడెంట్ యూనియన్ (బీఎస్ యు) నాయకులు డిమాండ్ చేశారు. బహుజన సంక్షేమ సంఘం(బీఎస్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, బహుజన స్టూడెంటు యూనియన్(బీఎస్ యు) మంద సురేష్ లు మాట్లాడుతూ శాయంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, కళాశాల చుట్టూ ప్రహరి గోడ నిర్మించే విధంగా కృషి చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను కోరారు. ఈ కళాశాలకు వచ్చే విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, బస్సు సౌకర్యం లేక చాలామంది నిరుపేద విద్యార్థులు కళాశాలకు రాలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బస్సు సౌకర్యం కల్పించడం మూలంగా శాయంపేట మండలం చుట్టూ ఉన్న గ్రామాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఆస్కారం ఉందని అన్నారు. నైపుణ్యం కలిగిన లెక్చరర్స్ ఉన్నప్పటికీ, కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఈ కళాశాలకు రాలేకపోతున్నారని వాపోయారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల శాయంపేటకు బస్సు సౌకర్యం కల్పించి కళాశాల చుట్టూ ప్రహరి గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చి చదువుకునే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ని కోరారు…..