Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు

ఈ నెల 9న నిర్వ‌హించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి మారుతీవ‌ర‌ప్ర‌సాద్
చిల‌క‌లూరిపేట‌ దేశం కోసం, దేశ ప్రజల కోసం జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను భార‌త‌క‌మ్యూనిస్టు పార్టీ ముందుండి నడిపిందని, పెట్టుబడిదారి విధానానికి, దోపిడీకి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక కర్షక ప్రజా శ్రేయస్సు కోసం నిరంత‌రం పాటుప‌డుతోంద‌ని సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి మారుతీవ‌ర‌ప్ర‌సాద్ చెప్పారు. మంగ‌ళ‌వారం ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో ముఖ్య నాయ‌కుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మారుతీవ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని వెల్ల‌డించారు. దేశ వ్యాప్తంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి కమ్యూనిస్టు పార్టీ మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిలో భాగంగా శాఖ, మండల, జిల్లా మహాసభలు జరుపుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాల్లోని శాఖలు మండల పట్టణ నియోజక వర్గ జిల్లాల మహాసభలు కొన్ని పూర్తి అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని 26 జిల్లాల మహాసభలు పూర్తి అయిన తరువాత ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలు నగరంలో రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతున్నామని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే నిర్వ‌హించే చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ ఏరియా, జిల్లా మ‌హాస‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని, ఇందుకు కార్య‌క‌ర్త‌ల‌ను, ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను స‌మాయుత్తం చేయాల‌ని సూచించారు. జులై5 స్మార్ట్ మీట‌ర్ల ఏర్పాటుకు వ్య‌తిరేకంగా నిర‌స‌నను విజ‌య‌వంతం చేయాలి విద్యుత్ ఛార్జీల పెంపు మరియు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జూలై 5న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని మారుతీ ప్ర‌సాద్ పిలుపు నిచ్చారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జూలై 5వ తేదీన నిరసనలు చేపట్టాలని రాష్ట్ర సీపీఐ నిర్ణయించిందని తెలిపారు. గృహాలకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్తు ఉద్యమం తప్పదని హెచ్చరించారు.గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన టీడీపీ.. ఇప్పుడు అదానీ మేలు కోసం స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని విమర్శించారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని, సర్ధుబాటు చార్జీల విధానాన్ని తొలగించాలని, అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కనెక్షన్‌కు స్మార్ట్‌ మీటర్‌ పెట్టడం నమ్మకద్రోహమేనన్నారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుందని, ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్‌ చేయించుకోవాలని, బ్యాలెన్స్‌ పూర్తి కాగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. పేదలకు అంధకారమే మిగులుతుందన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో వామ‌ప‌క్షాల‌ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. స‌మావేశానికి సీపీఐ ఏరియా స‌హాయ కార్య‌ద‌ర్శి
బొంతా ధానియేలు అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, సీపీఐ ఇన్‌చార్జి ఏరియా కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు, ఏఐటీయూసీ ఏరియా కార్య‌ద‌ర్శి దాస‌రి వ‌ర‌హాలు, మ హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, నాయ‌కులు చౌటుప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు, సుర‌భిరాజు, కందిమ‌ళ్ల వెంక‌టేశ్వ‌ర్లు, చండ్ర కోటేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.