Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు

ఏడాదిలో 80శాతం పైగా హామీలు అమలుచేసిన చంద్రబాబును ప్రశ్నించే అర్హత, స్థాయి, ఐదేళ్లలో ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చని జగన్ కు లేవు.

చెప్పింది విస్మరించడం జగన్ నైజమైతే… చెప్పినవే కాదు.. ఇంకా చేస్తానని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చెప్పడం చంద్రబాబు మేనరిజం.

హమీల అమల్లో జగన్ ఐదేళ్ల పాటు.. ఏటిమల్లన్న… బోడి మల్లన్న సామెతనే నిజం చేశాడు.

ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి, ముఖ్యమంత్రి అయ్యాక ముఖం చాటేశాడు.

హామీపై ప్రశ్నించిన ఉపాద్యాయులు, ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడి.. కేసులతో వేధించాడు.

ఏం చేసైనా.. ప్రజల్ని ఎంతగా మోసగించైనా, ఏ విధంగా ఏమార్చైనా సరే ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో జగన్ 2019లో ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చాడు. ఏ ఊరికి వెళ్తే.. అక్కడి సమస్య పరిష్కరిస్తానన్నాడు. కొన్నిచోట్ల ప్రజలు అడగకుండానే వారి మెప్పుకోసం నోటికి పనిచెప్పాడు. తీరా అధికారం దక్కగానే హామీలన్నింటినీ కట్టగట్టి తాడేపల్లి ప్యాలెస్ లో అటకెక్కించాడు. అలాంటి వ్యక్తి నేడు నిస్సిగ్గుగా 80శాతం హామీలు అమలుచేసిన చంద్రబాబును హామీలపై ప్రశ్నిస్తున్నాడు. ఏరుదాటే దాక… ఏటిమల్లన్న. దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా 2019 ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే.. వారికి ముఖం చాటేశాడు. ఎక్కడ తాను చెప్పిన వాటిపై తనను నిలదీస్తారోనన్న భయంతో పరదాలు.. పోలీసు పహారాల మధ్య దాక్కొని పాలన చేశాడు. చంద్రబాబు 143 హామీలిచ్చాడని అబద్ధాలాడుతున్న జగన్.. ముందు తాను ప్రజలకు చెప్పిన హామీలపై మాట్లాడాలి. హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడం జగన్ నైజమైతే… చెప్పినవే కాదు.. ఇంకా ఎన్నో చేస్తానని నేరుగా ప్రజల్లోకి వెళ్లి చెప్పడం చంద్రబాబు మేనరిజం. ఇచ్చిన హామీలు వందలు.. అమలుచేసిందేమో అరాకొరవారంలో సీపీఎస్ రద్దన్నాడు.. హామీపై ప్రశ్నించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కక్షసాధింపులకు పాల్పడ్డాడు..
దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానన్నాడు… చివరకు కల్తీమద్యం అమ్మి ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడు.
45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్ ఇస్తానని… వంచించాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని… నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టాడు. ఏటా మెగా డీఎస్సీ అమలు చేస్తానని చెప్పి…ఆశావహుల ఆశలపై నీళ్లుచల్లాడు. ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ పెడతానని.. చంద్రబాబు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు మూసేయించాడు. 5ఏళ్లలో 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చి.. టీడీపీ కట్టించిన టిడ్కో ఇళ్లకు రంగులేసి పాడుపెట్టాడు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని మారుస్తానని చెప్పి.. సర్కార్ దవాఖానాల్లో దూది…సిరంజీలు కూడా లేకుండా చేశాడు. చివరకు కరోనా సమయంలో ఆక్సిజన్ అందించలేని జగన్ అసమర్థత లక్షలాది చావులకు కారణమైంది. ఎన్నిలక్షల అయినా ప్రభుత్వమే భరించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తుందని ఊదరగొట్టి.. చివరకు ఆరోగ్యశ్రీ బకాయిలు బాకీ పెట్టి.. ఆసుపత్రుల ఎదుట వైద్యసేవలు బంద్ అని బోర్డులు పెట్టించాడు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి.. ఆఖరికి స్వయం సహాయక సంఘ సభ్యులు దాచుకున్న సొమ్మును దిగమింగాడు. ప్రతి మండలానికో వృద్ధాశ్రమం కట్టిస్తానని చివరకు తన తల్లినే ఇంటినుంచి గెంటేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఇచ్చిన హామీల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుంది. వందలాది హామీలిచ్చి… అరకొరా అమలుచేసి, రాష్ట్రప్రజల్ని మోసగించిన గొప్ప మోసగాడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందుకు, తప్పు ఒప్పుకొని జగన్ తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలినియోజకవర్గానికో కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తానని.. రైతుల ఉత్పత్తులకే ధరలేకుండా చేశాడు. రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్ ఉచితంగా ఇస్తానని చెప్పి.. ఎఫ్.పీ.పీ.సీ.. సర్ .. ట్రూఅప్ ఛార్జీల పేరుతో బిల్లులభారం మోపాడు. రూ.4వేలకోట్లతో ఏర్పాటుచేస్తానన్న ప్రకృతి విపత్తుల సహాయ నిధి, రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి, గ్యారంటీగా గిట్టుబాటు ధర కల్పన, ఉచిత బోర్లు వేయిస్తానన్న హామీలపై జగన్ ముందు రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. పోలవరం, వెలిగొండ. గుండ్రేవుల, గుండ్లకమ్మ, రాళ్లపాడు, సోమశిల కాలువ, ఎత్తిపోతల పథకాలు ఎందుకు పూర్తిచేయలేదో, రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ ఎందుకు సక్రమంగా నెరవేర్చలేదో వారికి వివరణ ఇచ్చి, చేయలేకపోయానని తప్పు ఒప్పుకొని జగన్ వారికి క్షమాపణ చెప్పాలి. హామీలివ్వడమే తెలిసిన వ్యక్తి జగన్.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా అమలుచేసి ఇంకా చేస్తానని ధైర్యంగా చెబుతున్న నాయకుడు చంద్రబాబు. గతంలో హామీల అమలుపై టీడీపీ నేతలు ఎప్పుడు ప్రశ్నించినా.. “ఐదేళ్లు అధికారంలో ఉంటాం..ఎప్పుడైనా అమలు చేస్తాం” అన్న జగన్ రెడ్డి.. వైసీపీ నేతలు ఇప్పుడు బుద్ధిలేకుండా ఏడాదిలో 80శాతం హామీలు అమలచేసిన చంద్రబాబును, కూటమిప్రభుత్వాన్ని ఏ ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నారో సమాధానం చెప్పాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.