

డి యఫ్ ఓ సతీష్ కుమార్
జనం న్యూస్ జనవరి 26(నడిగూడెం):- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హత కలిగిన చిట్టచివరి దరఖాస్తుదారులకు వర్తింపజేస్తామని మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాల ప్రారంభోత్సవం పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా మండలంలోని కాగిత రామచంద్రాపురం గ్రామంలో ఆదివారం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. ఇంకా అర్హత కలిగి పథకాలు వర్తించని వారు మరల దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన వారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్దిదారుల వివరాలను వెల్లడించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 398 మందిని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 125 మంది, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 36 మందికి రేషన్ కార్డులు వచ్చాయని, మరల ప్రజాపాలన గ్రామ సభలు ద్వారా మరో 96 దరఖాస్తులు రాగా మంజూరుకు కలెక్టర్ ఆమోదం కొరకు పంపించినట్లు తెలిపారు. రైతు భరోసా పతకానికి 561 మంది అర్హులుగా ఎంపికయ్యారన్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో రూపంలో ప్రజలకు చూపించారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రజలకు తన సందేశాన్ని అందిస్తూ తమది పేదల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వమని ఆమె అన్నారు.ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి పైలెట్ ప్రాజెక్టుగా కే ఆర్సీపురం ఎంపికవడం సంతోషంగా వుందని తెలిపారు.అనంతరం కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారంలో వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు.
పలువురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకట రెడ్డి, ఇన్ చార్జ్ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయ కుమారి, ఏఓ దుర్గ ప్రసాద్, ఏపీఓ, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముదిరెడ్డి నళిని వెంకట రెడ్డి, నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లింగారెడ్డి, మాజీ సర్పంచ్ లు మంచికంటి వెంకట రెడ్డి, గుర్రం నీలిమా గాంధీ, వెంకట్రామి రెడ్డి, వీరారెడ్డి, గుండు శ్రీను, బిక్షపతి పాల్గొన్నారు.