

జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళానిలయం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యావేత్త కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ కుల నిర్మూలనే గుర్రం జాషువాకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. శతాబ్దపు క్రితమే తన రచనలతో జాషువా ప్రజలను మేల్కొల్పారని వైవిధ్యమైన రచనలతో సమాజంలో ఒక చైతన్యానికి ఒక ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వ్యవస్థలో అనేక అసమానతలకు కులం కారణమైనందున కులరక్కసిని నిర్మూలించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అవుతుందని అన్నారు. గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మట్టి మనిషి పాండురంగారావు, దాసి సుదర్శన్ సతీమణి స్వతంత్రమ్మ లు బహుమతులు ప్రధానం చేశారు. స్వతంత్ర బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మోహన్ రాజు, బాలీశ్వర్, కిరణ్మయి, ఇన్చార్జి ప్రిన్సిపల్ సతీష్ చంద్ర, హైస్కూల్ హెచ్ఎం అనసూయ తదితరులు పాల్గొన్నారు.