Listen to this article

జనం న్యూస్- జులై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

టీబీ వ్యాధి సోకినట్లయితే నయం చేసే బాధ్యత మాది అని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ను,బస్తీ దవఖానను ఆయన సందర్శించారు. బస్తీ దవఖాన పరిధిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దత్తత తీసుకున్న పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. టిబి ఒకరి నుండి మరొకరికి సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సాగర్లో అర్బన్ సెంటర్, బస్తీ దవఖానాలను సందర్శించానని తెలిపారు. టీబీ సోకిన వారికి నయం చేసే బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటుందని అయితే తాము అందజేస్తే మందులను పూర్తి కోర్సును వాడాల్సి ఉంటుందన్నారు. డయాబెటిక్, హైపర్ టెన్షన్,గతంలో టీబీ మందులు వాడిన వారు, గతంలో కరోనా వచ్చినవారు,పొగ తాగే వారు, 60 సంవత్సరాలు నిండిన వారు,చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని వీరికి టిబి సోకే అవకాశం ఉందన్నారు. వీరికి టిబి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు వీరికి తెమడ పరీక్ష ద్వారా గాని ఎక్సరే ద్వారా గాని పరీక్షలు నిర్వహించి పాజిటివ్ ఉన్నట్లయితే వెంటనే చికిత్సను అందజేస్తామన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 13 ఆర్ బి ఎస్ కే వాహనాలు,మూడు 102 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీబీ సోకిన వారికి పూర్తిగా ఉచిత పరీక్షలు,ఉచిత చికిత్స అందజేస్తున్నామన్నారు. దాంతోపాటు ఎన్జీవోల సహకారంతో పోషక విలువలు పెంచే విధంగా న్యూట్రిషన్ కిట్స్ ను కూడా అందజేస్తూ దానితోపాటు పోషణ యోజన కింద నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు. టీ బీ అనేది కరోనా ఎలా సోకుతుందో అదే విధంగానే సోకుతుంది కాబట్టి టీబీ ఉన్నవారు జన సమూహం లోకి వెళ్ళినప్పుడు, ఇంటి సభ్యులతో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. టీబీ అనేది చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని టీబీ రహిత నల్గొండ జిల్లాగా తీర్చిదిద్దాడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అర్బన్ సెంటర్, బస్తీ దవఖాన సిబ్బంది గంగాబాయి, ఝాన్సీ, లింగయ్య, తిరుమల చారి, బాలరాజు తదితరులు ఉన్నారు.