

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లులో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ జూలై 25న జూమ్ మీటింగు నిర్వహించి, శక్తి టీమ్స్ పనితీరు, రిపీటెడ్ నిందితులు, మహిళల అదృశ్యం, గంజాయి కేసులను, ఫైనాన్సియల్ దర్యాప్తు, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషను సమీక్షించి, పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, సాంకేతికత వినియోగం గురించి దిశా నిర్దేశం చేసారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ – మాట్లాడుతూ శక్తి యాప్ పట్ల విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు శక్తి బృందాలు, స్థానిక పోలీసులు, మహిళా సంరక్షణ పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రతీ స్కూల్, కాలేజ్ లను సందర్శించాలని, స్కూల్లో చురుకుగా ఉన్న విద్యార్థులతోను, ఉపాధ్యాయులతో శక్తి వారియర్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. శక్తి వారియర్స్ టీంలో సమస్యను పరిష్కరించే నేర్పు ఉన్న విద్యార్ధిని శక్తి లీడ్ వారియర్గా ఎంపిక చేయాలన్నారు. శక్తి బృందాలు విస్తృతంగా స్కూల్స్, కాలేజ్స్ సందర్శించే విధంగాను, శక్తి యాప్ వినియోగం పట్ల కలిగే ప్రయోజనాలను విద్యార్ధినులకు వివరించాలన్నారు. విద్యార్ధినులకు స్వీయ రక్షణ పొందేందుకు అవసరమైన టెక్నిక్స్ ను నేర్పించేందుకు ఒక మహిళను నియమించామని, వారి సహకారంతో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రిపీటెడ్గా నేరాలకు పాల్పడుతున్న నిందితులపై నిఘా ఏర్పాటు చేయాలని, మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ తరహా నిందితుల కదలికలపై నిఘా పెట్టేందుకు హిస్టరీ షీట్లును ప్రారంభించాలన్నారు. ఇప్పటికే హిస్టరీ షీట్లు కలిగిన నిందితులపై గల కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషను జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. రిపీటెడ్ నేరస్థుల నేర ప్రవృత్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లు, పోయిన వాహనాలను, మిస్సింగు వ్యక్తులను గుర్తించేందుకు, సైబరు క్రైం, గంజాయి కేసుల్లో లభించిన చిన్న చిన్న ఆధారాలతో సాంకేతికతను వినియోగించి కేసుల మిస్టరీని చేధించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తుకు ఉపయోగపడే సాంకేతికత పట్ల అధికారులు అవగాహన పెంచుకొని, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 7సం.లకు పైబడి శిక్షలు విధించబడే అన్ని కేసుల్లో రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలను ఈ-సాక్ష్య యాప్లో అప్లోడు చేయాలన్నారు. ఈ-సాక్ష్య యాప్ ను ప్రతీ దర్యాప్తు అధికారి వినియోగించాలని ఆదేశించారు. 20కిలోల కంటే ఎక్కువగా గంజాయిని సీజ్ చేసిన ఎన్.డి.పి.ఎస్. కేసుల్లో నిందితులు సంపాందించిన అక్రమ ఆస్తులపై దర్యాప్తును మమ్మరం చేయాలన్నారు. ఈ తరహా కేసుల్లో డ్రగ్స్, గంజాయి వ్యాపారంతో నిందితులు, ఇతర కుటుంబ సభ్యులు, బినామీల పేరున ఎక్కడెక్కడ ఆస్తులను సంపాందించినది గుర్తించి, ఫైనాన్సియల్ దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. అదే విధంగా నమోదైన గంజాయి కేసుల్లో పిట్ ఎన్.డి.పి.ఎస్.చట్టంను ప్రయోగించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చెయ్యాలని, పరారీలో ఉన్న ఎన్.బి.డబ్ల్యు. వ్యక్తులకు ష్యూరిటీగా నిలిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు స్టేషను బిల్డింగు మరియు పరిసరాల్లో అమర్చిన సిసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్నలాంగ్ పెండింగు కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఆచూకీ లభించని నిందితులను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు
జరిగేందుకు అవకాశం ఉన్న పాత బిల్డింగులు, శివారు ప్రాంతాలను గుర్తించి నిఘా పెట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సంబంధిత లైన్స్ డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడి లైటింగు ఏర్పాటు చెయ్యాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ జూమ్ మీటింగులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎం.వీరకుమార్, ఆర్.గోవిందరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, డిసిఆర్బీ సిఐ బి.సుధాకర్, ఎస్ఐ ప్రభావతి, పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.