Listen to this article

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader, KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి (ACB office) వచ్చారు. అయితే విచారణకు తన న్యాయవాదిని అనుమతించక పోవడంతో తిరిగి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఏసీబీ ఏఎస్పీ అధికారి ఖాన్‌కు లిఖితపూర్వకంగా లేఖను అందజేశారు. ‘మీకు కావాల్సిన సమాచారం నేను ఆదజేస్తానని’ ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ అడ్డుకున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని.. దీని వల్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాధించేది ఏమీ లేదని అన్నారు. ‘‘ ఈరోజు మామయ్య రెండో సంవత్సరీకం. నన్ను ఇక్కడ విచారణకు కూర్చోబెట్టి నా ఇంట్లో దాడులు చేసేందుకు ప్రణాళికలు చేశారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణకు రావాల్సిన అవసరం లేదు. కానీ నేను చట్టానికి గౌరవించే పౌరుడిగా ఏసీబీ విచారణకు వచ్చాను. కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ తప్పించుకోను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే ధైర్యంగా వచ్చాను’’ అని కేటీఆర్ అన్నారు.