Listen to this article

జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్, నందాపూర్ మండలం, పాడువ తాలుక్, భాకాపుట్ గ్రామంకు చెందిన కూడా నగేష్ @ బాలరాజు (32 సం.లు)కు చెందిన రూ.56,00,000/-ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగష్టు 13న తెలిపారు. ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్, పాడువ తాలుక్, భాకాపుట్ గ్రామంకు చెందిన కుడా నగేష్ అలియాస్ బాలరాజు (32 సం.లు) వద్ద రూ.5,10,000/-లకు కొనుగోలుచేసిన 170కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులు ఏప్రిల్ 17, 2023న తరలిస్తూ ఎస్.కోట మండలం దేవిబొమ్మ జంక్షన్ వద్ద ఎస్.కోట పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి అమ్మిన ప్రధాన నిందితుడిగా కూడా నగేష్ @ బాలరాజును ఎస్.కోట పోలీసులు గుర్తించి, అతడిని ఏప్రిల్ 19, 2023న అరెస్టు చేసి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండు నిమిత్తం తరలించారన్నారు. విచారణలో నిందితుడు కూడా నగేష్ @ బాలరాజు గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ, వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నట్లు, వచ్చిన అక్రమ సంపాదనతో రూ.56,00,000/-ల విలువైన స్థిర, చరాస్థులను సంపాదించినట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇటీవల ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణను నియంత్రించుటలో భాగంగా గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేయడంతో, చర్యలకు ఉపక్రమించామన్నారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇచ్చిన ఆదేశాలతో ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి ఈ కేసులో మరింత లోతైన విచారణ చేపట్టి, నిందితుడు కూడా నగేష్ @ బాలరాజు ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్, నందాపూర్ మండలం, పాడువ తాలుక్, భాకాపుట్ గ్రామంలో రూ.55 లక్షల విలువైన ఇంటిని నిర్మించినట్లుగా గుర్తించామన్నారు. అదే విధంగా లక్ష రూపాయలు విలువైన ఓడి 10ఆర్ 1649 నంబరు గల ద్విచెక్ర వాహనం కూడా నగేష్ @ బాలరాజు యొక్క బావమరిది బసుదేబ్ బంగురు పేరుమీద కొనుగోలు చేసినట్లుగా గుర్తించామన్నారు. అంతేకాకుండా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బల్దా బ్రాంచ్ బ్యాంకు ఖాతకు 2019 మరియు 2022 సం.లో రూ.18,27,114/ల నగదు జమయినట్లుగా గుర్తించామన్నారు. ఇవి కాకుండా గంజాయి వ్యాపారుల నుండి కుడా నగేష్ @ బాలరాజు మరియు అతని భార్య కూడా జమున బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.53 లక్షల నగదు జమ అయినట్లు, నగదు బదిలీ చేసిన వ్యక్తులు కూడా గంజాయి వ్యాపారాలు సాగిస్తూ, పోలీసులకు పట్టుబడిన వారేనని, వారిపై కూడా జిల్లాలో గంజాయి అక్రమ రవాణ కేసులు ఉన్నట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.నిందితుడు కూడా నగేష్ @ బాలరాజు (32 సం.లు) గంజాయి అక్రమ రవాణను లాభసాటి వ్యాపారంగా భావించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, పలు రికార్డులను, డాక్యుమెంట్లును తనిఖీ చేసి, నిందితుడు కూడా నగేష్ @ బాలరాజు గత కొన్ని సంవత్సరాల్లో ఇంటిని నిర్మించి, మోటారు సైకిలును కొనుగోలు చేసినట్లు, సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ రూ.56 లక్షలు ఉంటుందని, నిందితుడి అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్లుగా నోటీసులు కూడా జారీ చేసామ న్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్కతాలోని కాంపింటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్ళిపోయినట్లు, సదరు ఆస్తులను ఎవరు కొనుగోలు చేసినా, చెల్లనేరవని, ప్రజలు గమనించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టరు వి.నారాయణమూర్తి మరియు ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.