

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19 ( తెలంగాణ పత్రిక)
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకాలలో జరుగుతున్న అవినీతి, దళారి వ్యవస్థలను నిర్మూలించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు కొంతమంది రాజకీయ నేతల దళారులు కలిసి ఉద్యోగాల కోసం మూడు లక్షల రూపాయల వరకు లంచాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అన్యాయ నియామకాలను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా పరుగు పందెం ద్వారా మాత్రమే సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు గత శనివారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కి వినతిపత్రం కూడా అందజేశామని సంఘం పేర్కొంది. నిరుద్యోగులకు నిజాయితీగా అవకాశాలు కల్పించడానికి, రాజకీయ జోక్యాలు లేకుండా, పైరవీలకు తావు లేకుండా పేపర్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరుగు పందెం పరీక్ష ఆధారంగా మాత్రమే నియామకాలు జరగాలని సంఘం స్పష్టం చేసింది.